ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తి తనను వేధిస్తున్నాడని నటి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడని నిధి తన ఫిర్యాదులో పేర్కొంది. వేధించే వ్యక్తి తన ఇన్‌స్టా ఖాతాను పదేపదే అసభ్యకరమైన సందేశాలతో ట్యాగ్ చేస్తున్నాడని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది.
ఆన్‌లైన్ బెదిరింపుల కారణంగా తాను, తన కుటుంబం మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిధి పేర్కొంది. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిధి అగర్వాల్ ఫిర్యాదు చేసినప్పటికీ ఆ వ్యక్తి పేరు మాత్రం బయటకు రాలేదు. అయితే గత కొంతకాలంగా తనను మేసేజ్‌లకు ఇబ్బంది పెడుతున్నట్లు నిధి అగర్వాల్ పోలీసుల ముందు వాపోయారు.
ప్రస్తుతం నిధి అగర్వాల్ రెండు ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం గమనార్హం. విజయవాడలో షూటింగ్ జరుపుకుంటున్న యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లులో ఆమె పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. ఇది కాకుండా ఆమె ప్రభాస్‌తో రొమాంటిక్ కామెడీ రాజా సాబ్‌లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. హరిహర వీరమల్లు చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా షూటింగ్ విజయవాడలో జరుగుతోంది. అయితే నిధి నటిస్తోన్న ఈ మూవీ ఈ ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో వైపు రాజా సాబ్ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ది రాజా సాబ్‌లో కూడా నిధి కీలకపాత్రలో నటిస్తోంది. ఏప్రిల్ 10, 2025న ఐదు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. మీడియా కథనాల ప్రకారం ఈ చిత్రంలో సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
0 Comments